'కొత్తపాళీ'-'బూనృ'త్య విలాసంబెట్టిదనిన...

ఎవరీ కొత్తపాళీ? అన్నది, ఆయన బ్లాగ్లోకంలో మెఱుపులా దూసుకొచ్చినప్పటి నుంచీ నాకు సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలింది. ఈయన మనకన్నా చాలా పెద్దాయన, తెలుగు సాహిత్యం మీద మంచి అవగాహన ఉన్నాయన, బహుశా వేల్చేరు గారేమో అని రానారెని ప్రశ్నించడమూ జరిగింది. కానీ చివరికి శ్రీరాముడి దయ చేతను, నా పరిశోధన మూలంగానూ మన అభినవ బూన్(బ్లాగు బ్రౌణ్) దొర గారు దొరికారు. ఒకప్పటి ఈ బాపట్ల బ్రహ్మచారి గారే 'నాశి'గా రచ్చబండలోనూ, 'ఈమాట'లో ఎస్.నారాయణస్వామిగా ఎన్నో కథలను రాసిన రచయిత గానూ, ఈనాడు తెలుగు బ్లాగులను కొత్త పుంతలు తొక్కిస్తున్న 'కొత్తపాళీ'గానూ, ఫ్లికర్లో భరతనాట్య ప్రదర్శన చేస్తూన్న 'నాశిశాన్'గానూ, ఈ బహుముఖప్రజ్ఞాశాలి తన విశ్వరూపసందర్శనం కావించారు. మరి తెలుగు బ్లాగర్లందరూ ఒకరికొకరు ముఖపరిచయం లేకున్నా మన బ్లాగు చిత్రాల ద్వారా అందరికీ తెలుసు, కావున సభామర్యాద కాదేమో అని రాముడనుకొన్నా ధైర్యం చేసి ఈ విషయం బ్లాగుతున్నాను. ఇక చిత్రం 'సర్వజన' విభాగంలో ఉండడం వల్ల అందరూ చూసినా అభ్యంతరం లేదనుకొంటాను. అయినా నా తెంపరితనానికి ముందుగానే క్షమాపణలతో...

13 comments:

వికటకవి said...

అయ్యబాబోయ్, నిజమే! ప్రజ్ఞాశాలి అని తెలుస్తూనే ఉంది గానీ, ఇన్ని ముఖాలు గానా? తెలియజేసిన మీకూ నెనర్లు. కొత్త పాళీ గారికి జయము జయము. మీతో ఏ ఏ విషయాల్లో బ్రేకులేసుకుంటూ మాట్లాడాలో పనిలో పనిగా తెలిసింది.

S said...

నా భాష లో అయితే కొత్తపాళి గారు రాక్స్! :))

రాకేశ్వర రావు said...

కోపా. నాశి. నాశిశాన్. నారాయణస్వామి.
షణ్ముఖస్వామిలా ఎన్ని ముఖాలూ...

Carani Narayana Rao said...

A good espionage activity!Bravo!

Rama said...

నిజంగానే నిజమా కొత్తపాళిగారు బహుముఖ ప్రజ్ఞాశాలి.. అన్నమాట!! తెలియజేసిన మీకు..ధన్యవాదములు.. బ్లాగ్ ద్వార మా అందరికి సూచనలు .. సలహాలు ఇస్తూ మాకు మార్గదర్శం అయిన గురువుగారు కొత్తపాళిగారికి వినమ్రంగా అందజేస్తున్న వందనములు.. [నేను నిజంగానే కొత్తపాళిగారు ఏ కళాశాల విధ్యార్దో (రచనల బట్టి) అనుకొన్నాను తెలియక ఏమన్నా తప్పుగా మాట్లాడితే.. (మీరిచ్చిన సలహాలు .. సూచనల విషయంలో) క్షమించండి కొత్తపాళిగారు..]

ప్రవీణ్ గార్లపాటి said...

వాఆఆఆఆఆఆఆవ్...
ఇంత ప్రజ్ఞావంతులు మన బ్లాగు లోకంలో ఉండడం మన అదృష్టం.
హేట్సాఫ్ కొత్తపాళీ గారు :)

cbrao said...

కొత్తపాళి గారి లోని బహుముఖాలను ఆవిష్కరించిన మీకు అభినందనలు.

నువ్వుశెట్టి బ్రదర్స్ said...

అయ్యబాబోయ్ ఈ బహుముఖప్రజ్ఞా శాలిని గురించి చదువుతుంటే ఆనందముగానూ ఆశ్చర్యము గానూ ఉంది.గ్రేట్. ఆవిష్కరించిన మీకూ అభినందనలు.

Nagaraju Pappu said...

మాస్టారు డాన్సుకూడా చేస్తారన్నమాట. భలే, భలే. ఇక మిగిలింది చిత్రలేఖనమొక్కటే. వెతకండి, ఆ కళలు కూడా దొరుకుతాయామో..
--నాగరాజు

కొత్త పాళీ said...

ఇవ్వాళ్ళ పొద్దున కూడలి తెరిచి ఒక్క నిమిషం విస్మయంతో చేష్టలుడిగి ఉండిపోయాను. వెంటనే ఏమన్నా రాద్దామనుకున్నాను గానీ ఏం రాయాలో తోచలేదు ఇదే మొదటి సారి :-) కొత్తపాళీ పేరు వెనుక నా అస్తిత్వం పెద్ద రహస్యమేం కాదు, మీలో చాలా మందికి నేను పలానా అని తెలుసు కూడా. అంచేత ఇస్మైల్ భాయ్ చేసింది అంత తెంపరి తనమేమీ కాదు గానీ ఆయన కుతూహలమూ, డికెష్టితనమూ చూసి నవ్వొచ్చింది. తనే అన్నట్టు ఒక విధంగా మనమంతా ఈ తెలుగు బ్లాగు కుటుంబంలో సభ్యులం .. అలా నా విశేషాలు నా కుటుంబ సభ్యులతో పంచుకోవడమూ ఇష్టమే .. అసలందుకేగా ఈ బ్లాగులు మొదలెట్టింది ..
ఆయన దీన్ని గురించి రాయడం ఒక ఎత్తైతే బ్లాగు కుల వృద్ధుల దగ్గిర్నించీ అందరూ ఇలా అభినందనలతో సందేశాలు రాయడం అసలు నేను ఊహించనిది. మీ అభిమానానికి ధన్యవాదాలు.
ఒక్క మాట చెప్పాలని ఉంది. మన ముందు తరం వాళ్ళల్లో ఒక్కొక్కరూ ఎంతలేసి పండితులున్నారు? గిడుగు రామ్మూర్తి, వేటూరి ప్రభాకర శాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు, తిరుమల రామచంద్ర వంటి వారు పది పదిహేను భాషలలో పండితులు. రాళ్ళపల్లి అనంతకృషణ శర్మగారు సాహిత్య సంగీతాలలో నిధియే కాక భారతీయ కళా రహస్యములనేకము హృదయస్థమైన వారు. అడవి బాపిరాజు కవి, నవలాకారుడు, శిల్పీ, చిత్రకారుడు. అంతెందుకు .. వీఏకే రంగారావు అనే మహానుభావుడు ఇప్పటికీ చెన్నైలో ఉన్నారు, మొన్నీమధ్య వరకూ ఏదో పత్రికలో "ఆలాపన" అని సినిమా సంగీతం గురించి ఒక కాలం రాస్తుండేవారు.. సంగీత సాహిత్యాల్లోనే కాక నాట్యంలోనూ నిధి. వాళ్ళందరి బహుముఖ ప్రజ్ఞ ముందు నేనెంత?
@వికటకవి - మీ ఇంటి ఎడ్రసు నాకు తెలీనంత వరకూ మీరు బ్రేకులేసుకోనక్కర్లేదు :-)
@రాకేశ్వరా - ముఖాలెన్నైనా దాని వెనక మనిషొకడే!
@రమా - అవునండీ నేను విద్యార్ధినే .. జీవితమనే ఈ కళాశాలలో ..
@ నాగరాజుగారూ - చిత్రలేఖనం కూడా కొన్నాళ్ళు సాధన చేశాను. ప్రస్తుతం అందుబాటులో లేవు, ఉన్నప్పుడు తప్పక చూపెడతాను.

Anonymous said...

నాలోని డీకేస్టీ వాడు ఎప్పుడో చెప్పాడు ఇలాంటిదేదో వుంటుందని. సి.బి. రావ్ గారు తెలుగు బ్లాగు గుంపులో అడిగిన ప్రశ్నకు కొత్తపాళీ గారు ఇచ్చిన సమాధానం చూసి నాకు "నరసింహ నాయుడు" సినిమా గుర్తుకు వచ్చింది. అందులో బాల కృష్ణ పూర్వాశ్రమం... గట్రా..గట్రా లాగా ఏదో వుందనిపించింది. అయినా అది ఆయన వ్యక్తి గతం గదా అని సర్దుకున్నాను. ఇప్పుడు డాక్టరు గారు స్టెత స్కోపును పక్కన పెట్టి కత్తెరలతో తవ్వకాలు జరిపారన్న మాట. కొత్త పాళి గారు లాంటి వారు బ్లాగుల్లో వుండటం బ్లాగులు చేసుకున్న అదృష్టం.

-- విహారి

జ్యోతి said...

అయ్యబాబోయ్. కొత్తపాళిగారు నాట్యం కూడా చేసారా?. నిజంగా ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి మన మిత్రుడవడం మన అదృష్టం కదా. ఇంకా ఆయన చెప్పని కళలేమైనా ఉన్నాయా. అవి దాచితే దాగేవా?

Ramya said...

that's great