బ్లాగ్కలహాలు!

ఇదేదో కొత్త రకం ఆల్కహాలని ఇటు వేపు వచ్చిన మందుబాబులకు క్షమాపణలతో...
ఈ మధ్య మన బ్లాగుల్లో కలహాలు ఎక్కువయ్యాయి. మరీ చెప్పుకోదగినంతవి కాకపోయినా...తెలుగు వారిలో కాస్తో కూస్తో సమైక్యంగా ఉన్నది మన బ్లాగర్లేనని అనుకొన్నంతలో...ఇలా జరగడం శుభసూచకం కాదు. మన మధ్య అభిప్రాయభేదాలు ఉండడం సహజం, అసలు అవే చర్చకు పునాది. కానీ ఆ అభిప్రాయలను వ్యక్తపరచడానికి మనకున్న మాధ్యమం అయిన బ్లాగులే ఈ కలహాలకు కారణం. అవును...మీరు మనస్సులో ఒకటనుకొని రాస్తారు దాన్ని చదివి ఆ భావం అందక, మరోలా భావించుకొని, ఇంకోలా సమాధానం చెప్తారు కొందరు. దీనికి కారణం మనలోని ఆలోచనలు సరిగా ఇతరులకు తెలియాలంటే మాట పలికే తీరు, మన ముఖకవళికలు, సమయం, సందర్బం ఇలా ఎన్నో ఉన్నాయి. రాతలో సంభాషణ చేయాలంటే కుదరదు మరి. కానీ బ్లాగ్ముఖంగా మనం రోజూ చేస్తున్నదదే! అందుకే ఈ తంటా! కావలిస్తే మన బ్లాగుల్లోనే కాదు 'ఈమాట' వగైరా చోట్ల జరిగే కామెంట్ల సంభాషణ చదవండి మీకే అర్థమవుతుంది. కాబట్టి ఇకపై టపా రాసేటప్పుడు, వ్యాఖ్య చేసేటప్పుడు ఈ ముక్క మనసులో పెట్టుకోవాలని మనవి. (ఈ 'సెమాంటిక్స్' గురించి మన భాషా శాస్త్రజ్ఞులైన 'కొలిచాల' గారి నుంచి ఓ టపా/వ్యాఖ్య ఆశిస్తూ...ఎన్నాళ్లుగానో ఈ సంగతి రాయాలని అనుకొంటూ వాయిదా వేస్తున్నా... ఇప్పటికి రాయించిన 'రానారె'కు నెనర్లు!)

ఉపసంహారం: బ్లాగులు రాస్తున్న రెంటి'గాళ్ల'లో (ఒంటిగాడు కానివాడు రెంటిగాడు:) జరిగే బ్లాగ్కలహాలు మరో ఎత్తు!

12 comments:

Unknown said...

ఇది మనము ఇంతకు ముందు ఊహించిందే. జనాలు పెరిగే కొద్దీ ఇలాంటివి తప్పవు. ఎవల్యూషన్ లో భాగమే.

మీరు చురుగ్గా రాస్తున్నారు సంతోషం. :)

oremuna said...

నెనరు రొంబ ఫేమస్ అవుతుందే!

Anonymous said...

నెనరు అచ్చ తెలుగు పదం. అందులో ఉన్న అక్షరాలన్నీ, తెలుగులో అతి తరచుగా వాడుతున్న అక్షరాలే :)

Anonymous said...

ప్రదీప్ గారు - జోకు అర్థం కాలేదు :(
తెలుగులో అతి తరచుగా వాడుతున్న అక్షరాలతో ఏ పదాన్ని తయారు చేసినా - అచ్చ తెలుగు పదమౌతుందా? (నెనరు తెలుగు పదం కాదని కాదు నేను అనడం).

ప్రదీపు said...

@సిరి
ఒపుకుంటాను, తరచుగా వాడటానికి, అచ్చ తెలుగు పదం అనటానికి సంబంధం లేదని, ఆ కామెంటు రాస్తునప్పుడు నేనది ఆలోచించలేదు.

Dr.Pen said...

మా సీమ మాండలికంలో ప్రత్యేకంగా కర్ణాటాంధ్ర సరిహద్దుల్లో/పెనుకొండ ప్రాంతంలో పల్లెల్లో సాధారణంగా ఉపయోగించే పలుకుబడి 'నెఱ్లు' (ఉదా: 'ఆయప్పకి సెల్లెలంటే సాలా నెర్లు'.)ఈ పదం నుంచే వచ్చిందనుకొంటాను. ఇక్కడ ప్రేమ, ఆత్మీయత, ఆప్యాయత ఇవన్నీ కలగలిసిన అర్థంలో వాడబడింది. కాబట్టి అచ్చ తెనుగే అనుకొంటాను!

Unknown said...

బ్లాగు వ్యాఖ్యలు చర్చా వేదికలుగా పనికిరావని బాగాచెప్పారు. అది అందరూ గుర్తుంచుకుంటే కొంతలో కొంత సజావుగా సాగుతాయి సంభాషణలు. అయినా ప్రవీణ్ అన్నట్టు పరిణామక్రమాన్ని మనమాపలేము :-)

కొత్త పాళీ said...

అదలా ఉండగా .. ప్రవీణ్ అన్నట్టు మందెక్కువయ్యే కొద్దీ మనందరం ఒకటే అనే భావన కాస్త పలచబడుతుంది. ఈ మాత్రానికి చింతించాల్సిన పని లేదు. కానీ ఎప్పుడూ వ్యాఖ్యలు వ్యక్తిగతం కాకూడదు, అశ్లీలం కాకూడదు. ఈమాట లో అరణ్యకవితల గురించీ, దాన్తరవాత ప్రాణహితలో రక్తమాంసదాహం గురించీ జరుగుతున్న బ్లాగ్యుద్ధం (పోనీ చర్చ అనుకోండి) నాకు కించిత్ సంతోషాన్నీ, బోలెడు ఆశనీ కలిగిస్తోంది. తెలుగు కవిత్వం గురించి ఈ మాత్రం పస ఉన్న చర్చ నేనీమధ్య చూళ్ళేదు. ఆందులోని శ్లేషలు, చమత్కారాలు, ఓహ్!

netizen నెటిజన్ said...

అవును.
వాఖ్యని సహృదయంతో అంగికరించలేనప్పుడు,"బ్లాంతి" ని తన ఇంట్లోనో, కడుపులోనో దాచుకోవాలి.
"నా బ్లాగ్, నా ఇష్టం,మీరేమనుకున్నా నేను పట్టించుకోను" అని అనుకుంటే అది వేరు.

వాఖ్యలు గమనించినంతలో ఇమంకొకటి కూడ కనపడుతుంది..మీరు గమనించారోలేదు.
ఒకవిధమైన "అంటరానితనం".
There is a deafening silence all around your comment and your very presence.

ఇది చదవండి:
http://netijen.blogspot.com/2007/06/blog-post_17.html

రాధిక said...

తెలుగుపీపుల్ డాట్ కాం లో ఇలాంటివి చాలా జరిగేవి.ఇప్పుడు లేవనుకుంటా.అటువాళ్ళే ఇటు వచ్చారు.వాళ్ళు కఠినం గా పరుష పదజాలం తో చెపుతున్నా వాళ్ళు చెప్పేదానిలో వినదగ్గవి,ఆచరించదగ్గవి చాలా వుంటాయి.చర్చ కాస్తా గొడవకి దారి తీస్తుంటే వినోదం గా చూస్తూ వుండిపోయి మంచిని గ్రహించాలని మర్చిపోతున్నాము.

Anonymous said...

ఆంధ్రభోజులవారికి,

ప్రశ్నతో పాటు సమాధానమూ చెప్పారు. మంచి సూచనే. కొత్త పాళీ గారన్నట్లు అశ్లీలం,వ్యక్తిగతము కానంత వరకూ మాటల తూటాలూ, జడివానలు, తాపాలూ (సరదాగా) భరించవచ్చు.

మరో మాట, బ్లాగ్కలహాలు అన్నారు. మీరు గమనించారో లేదో. "గ్క" ని అసలు పలకలేము. బహుశా, ఆంగ్లాంధ్రసంధి చేసి "బ్లాక్కలహాలు" అనాలేమో!

Dr.Pen said...

స్పందించిన అందరికీ నెనర్లు!
వికటకవీ...
సార్థకనామధేయుడవయ్యా! అవున్నిజమే నేను గమనించనేలేదు...'గ్క'ను పలకడానికి విఫలయత్నం చేశాము ఇంట్లోని వారంతా! అయినా 'బ్రహ్మ'లాగా ఇలా కానిచ్చేయండి:)