ఇంట గెలిచాం...ఇక రచ్చ గెలుద్దాం: దేశిపండిట్!

తెలుగు బ్లాగ్లోకం వింటిని వీడిన బాణంలా రివ్వున దూసుకుపోతోంది. ఎన్నెన్నో కొత్త బ్లాగులు, కొంగ్రొత్త టపాలతో కూడలి, తేనెగూడు కళకళలాడుతున్నాయి. తెలుగు బ్లాగులకు ఈ అంతర్జాలంలో ఘనమైన గుర్తింపు కూడా ఉంది. కానీ ఇవన్నీ మన తెలుగు వారికే తెలుసు, మిగతా ప్రపంచానికి మన తెలుగు బ్లాగుల వాడి-వేడి తెలియజెప్పడమెలా? అనే ప్రశ్న చాలా మందికి వచ్చింది. వీవెన్ 'క్రాస్ రోడ్స్' తో ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు.

అలా నేనూ కొంత ఆలోచించాను. ఇంతలో...మొన్న ఇండీబ్లాగీస్ పోటీలో నెగ్గిన పలు బ్లాగులు చదువుతున్నప్పుడు 'ఉత్తమ బ్లాగు వేదిక' మరియు 'ఉత్తమ రూపకల్పన' పోటిలో విజయం సాధించిన 'దేశిపండిట్' బ్లాగు నన్నాకర్షించింది. వైవిధ్యమైన పలు భారతీయభాషల బ్లాగులను ఒకచోట చేర్చి పాఠకులకు అందజేసే ఈ వినూత్నమైన ఒరవడి నచ్చి అక్కడ మన బ్లాగుల కోసం చూస్తే కన్నడ,తమిళ,మరాఠీ,బెంగాళీ,హిందీ బ్లాగులుండి 'తెలుగు' బ్లాగులు లేకపోవడంతో మనస్సు చివుక్కుమంది.

వెంటనే 'దేశిపండిట్' వ్వవస్థాపకుడైన ప్రతీక్/పాట్రిక్స్ కు ఓ ఈ-లేఖ పంపాను. తను కూడా అమిత ఆసక్తితో తెలుగు బ్లాగులను ఆహ్వానిస్తూ, తెలుగు బ్లాగుల నిర్వాహకుడిగా నాకు అవకాశమిస్తూ, మన తెలుగు బ్లాగ్ప్రపంచానికి ఘనస్వాగతం పలికారు. మనకున్న తెలుగు బ్లాగులకు ఓ కూడలి, మరో తేనెగూడు ఉన్నా ఈ 'దేశిపండిట్' ముఖ్యోద్దేశం, ఉన్న వందల బ్లాగుల్లో నుంచి ఉత్తమమైన 'టపా'లను సేకరించి తెలుగులో, ఆంగ్లంలో చిన్న వ్యాఖ్యానంతో ప్రపంచానికి పరిచయం చేయడం. ఇక్కడ మన బ్లాగుల్లోని వైవిధ్యాన్ని తెలుగువారితో పాటు, తెలుగు మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ తెలియజెప్పటం ద్వారా మనకు తెలియని చాలా మందికి ఉత్సుకత కలుగజేయవచ్చు.

ఆరులక్షలకు పైగా హిట్లతో, నెలకు అరవైవేలకు పైగా పుటల వీక్షణ కలిగిన 'దేశిపండిట్'లో ఇలా తెలుగు బ్లాగులను పరిచయం చేసే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తూ... ఈ విషయంలో మీ సహాయసహకారాలను ఆశిస్తూ...ఈ శుభవార్త మీతో ఇలా పంచుకొంటున్నాను. ఈ సోమవారం నుంచి ప్రారంభించిన ఈ ప్రయాణం నిర్విఘ్నంగా సాగాలనీ, ఇది ఇంకా ఆరంభం మాత్రమే కాబట్టి మిగతా టపాలను తొందర్లో చూస్తారనీ, కనీసం వారానికి కనీసం ఏడు ఆపై ఆణిముత్యాలను మీకందించాలని నా ప్రస్తుత ప్రణాళిక. నా చూపు దాటిపోయిన ఆసక్తికర టపాలను మీరూ ఇక్కడ సూచించవచ్చు.

11 comments:

Anonymous said...

అమ్మ డాక్టరు గారూ!!!

మీరు ఇంత పని చేస్తారనుకోలేదు. నేను ఏ విభాగంలో అయితే పోటీ చేద్దామనుకున్నానో అదే విభాగంలో గెలిచిన బ్లాగులో నా బ్లాగు బ్లాగాయణం పఠిస్తారా? మిమ్మల్ని ఊరికే వదల్ను.
మీ ఊరికొస్తా.
మీ ఇంటికొస్తా.
మీ వంట గదికొస్తా.
ప్లాస్టిక్ పళ్ళెమైనా సరే
వెండి పళ్ళెమైనా సరే
ఇత్తడి పళ్ళెమైనా సరే
స్టీలు పళ్ళెమైనా సరే
రాగి సంగటి, చెనిగ్గింజల ఊర్మిండి ఒక్క చేత్తో
పట్టుకుని నోట్లోకి తోసేస్తా..
మీకు ఏమీ లేకుండా చేస్తా.


సింహింద్రసింహా రెడ్డి విహారి

Anonymous said...

మొత్తానికి మన తెలుగుని జాతీయ వేదికల మీదికి తీసుకెళుతున్నారు. చాలాసంతోషం. మొదలు దివ్యంగా వుంది. ప్రతిదీ నవ్యంగా సవ్యంగా ముందుకు తీసుకెళ్ళగలరని ఆశిస్తూ మీకు శుభాకాంక్షలు.


విహారై.

vrdarla said...

డా. ఇస్మాయిల్ గార్కి శుభాకాంక్షలు.

farook said...

great job, i wish u all the best, it is a very good start.

-thelugodu

Naveen Garla said...

గెలవాలి .. గెలవాలి...తెలుగోడు గెలవాలి.
మంచి ప్రయత్నం. మీకు నా శుభాకాంక్షలు

spandana said...

డాక్టరు గారూ,
తెలుగు వెలుగులను దేశమంతటా పంచే దీక్ష చేపట్టినందుకు ధన్యవాదములు. నా బ్లాగు "అంతరంగం"ను పరిచయం చేసినందులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

--ప్రసాద్
http://blog.charasala.com

Anonymous said...

తెలుగు జండా నిలపడానికి మరో మంచి అవకాశం. బాధ్యత నెత్తినేసుకొన్న డాక్టర్ గారికి శుభాభినందనలు

రాధిక said...

చాలా మంచి పని చేసారు.ఇలా మన తెలుగు బ్లాగుల గురించి కొంతమందికయినా తెలుస్తుంది.

కొత్త పాళీ said...

చాలా సంతోషం!!!

rākeśvara said...

దేశీ పండిట్ మీద తెలుగు ఉండాలని నాకూ అనిపించింది గానీ, అనుభవంలేని వాడిని కాబట్టి చొరవ చూపలేదు.

తెలుగు దూత పదవి మీలాంటి అనుభవజ్ఞులు నిర్వహించడం మా అదృష్టం. దాని వలన మీ సమయం ఎక్కువ వృధా కాకూడదని ఆశిస్తూ

-రాకేశ్
http://andam.blogspot.com/

Anonymous said...

manchi pani chesaaru.
krathajnatalu
Venkat
www.24fps.co.in