తెలుగు వారందరి చేత ఆప్యాయంగా 'అన్నా' అని పిలిపించుకొన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు "ఎన్.టి.ఆర్", 'దివిజ రాజన్యుల గుండియల్ దిగ్గు రనగ నరుగుచున్నాను అమరపురికి' అంటూ మనల్ని వదలి నేటితో 11 సంవత్సరాలు. మన తెలుగు ప్రజల పైన రాజకీయంగా, సామాజికంగా, సంస్కృతీ పరంగా ఆయన వేసిన ముద్ర ఎప్పటికీ చెరగిపోనిది. అప్పటివరకు మద్రాసీలుగా పిలువబడ్డ మనకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఆత్మాభిమానపు బావుటా ఎగురవేసిన ధీరోదాత్తుడు.
కథానాయకుడై రాముడిగా, భీముడిగా, కృష్ణుడిగా, రావణుడిగా, భీష్ముడిగా, ధుర్యోధనుడిగా, శ్రీకృష్ణదేవరాయలుగా, తోటరాముడిగా, బండోడిగా, బొబ్బిలిపులిగా, కొండవీటి సింహంగా, శ్రీనాథుడిగా, విశ్వామిత్రుడిగా, చండశాసనుడిగా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో పాత్రల్లో జీవించి, ఎన్నో ఏళ్లు తెలుగు ప్రజలను రంజింపజేసిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించి ఎందరెందరికో రాజకీయ భిక్ష పెట్టి, ఢిల్లీలో తిరిగే రాజకీయాలను గల్లీ లోని పేదింటి వారి వరకు తెచ్చిన విప్లవ నాయకుడు.
నిమ్మకూరులో ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఈ 'నందమూరి తారక రాముడు' తన చివరి క్షణం వరకు పేదప్రజల పక్షపాతిగా, వారికి ఇంత కూడు, గుడ్డ, నీడ ఉండాలని తపన పడి అందుకోసం శ్రమించిన నాయకుడు. రాజకీయనాయకుడుగా కొన్ని నిర్ణయాలు, కులం పరంగా ఆరోపణలు ఈ చంద్రుడిలో మచ్చలా మిగిలినా అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు నాయకుడు. జనవరి 18, 1996 నా అభిమాన నాయకుడి మరణవార్త విన్న క్షణం ఎంతలా ఏడ్చానో. వెన్నుపోటుతో నీతి, నిజాయితీలకు సమాధి కట్టి అందలం ఎక్కిన వారిని నేనెన్నటికీ క్షమించలేను.
ఆ వెన్నుపోటే జరగకుంటే ఆనాటి రాజకీయచిత్రంలో ధృవతారగా ఉన్న ఎన్టీయార్ మన 'దేశప్రధాని' ఖచ్చితంగా అయిఉండేవారు, మన పక్కింటి దేవెగౌడకు ఆ అవకాశం వచ్చింది. 2000లలో కేంద్రతపాలా శాఖ విడుదల చేసిన ఈ స్టాంపు 'అ'మ్మలోని ప్రేమను, నా'న్న'లోని సంరక్షణను అందించే 'అన్న'గా ఆయనకు నివాళులర్పించింది. రాయలసీమ దత్తపుత్రుడిగా తనను తాను అభివర్ణించుకొన్న ఆయన, 'నందమూరిపురం'గా ఖ్యాతికెక్కిన మా హిందూపురం శాసనసభ్యుడిగా తన చివరి క్షణాల వరకు సేవలందించారు. అన్నా! అందుకో నా నివాళి.
8 comments:
annagaarini, aa abhimaanaanni gurtu chesinanduku thanks.
తెలుగు ప్రజల చరిత్రనే మార్చిన మహానుభావునికి ఇదే నా ఘన నివాళి
'ఇక సెలవు' అంటూ మనల్ని వదిలి వెళ్ళినా మనందరి గుండె గుళ్ళల్లో ఆ మహానుభావుడు ఎప్పుడూ కొలువుండే ఉంటాడు ఎంటీవోడుగా, ఎన్ టీ ఆర్ అన్నగా, శ్రీకృష్టుడంటే ఆయన ఫొటో చూపించేలా. మన సంప్రదాయాల్ని, మన పురాణాల్ని ఎప్పుడూ మనకూ, మన ముందు తరాల వాళ్ళకు గుర్తుంచుకునేలా ఆయన చేసిన సినిమాలు మనకు ఎఫ్ఫుడూ సహాయపడుతుంటాయి. తెలుగోడీ వాడిని, వేడిని చూపినోడు మన ఎంటీవోడు.
తెలుగువాడి ఆత్మగౌరవానికి చిహ్నం "అన్న".
జంట నగరాలో తెలుగు వ్యాప్తికి కారణం "అన్న".
దక్షిణ భారతీయుడు అంటె మదరాసీ కాదు అని చాటి చెప్పింది "అన్న".
రాముడంటే "అన్న".
కృష్ణుడంటే "అన్న".
దేవుడంటె "అన్న".
కృష్ణదేవరాయలు అంటే "అన్న".
- అనిల్ చీమలమఱ్ఱి
అన్న ఆందించిన స్ఫూర్తితో మనమేంచేయాలో ఏంచేయకూడదో కూడా చెప్పివుంటే ఈ ఘన నివాళికి పూర్తి సార్థకత చేకూరేది.
కర్ణుడికి ఖ్యాతి తెచ్చిపెట్టి, రావణుడిని మరో కోణం లో చూపెట్టిన అన్న గారికి అన్న గారే సాటి.
అభిమానధనుడంటే ఇలా వుండాలి, ఆత్మ గౌరవమంటే ఇలానే వుండాలి అని ధుర్యోధనుడిని చూపెట్టిన అన్న గారు తన అభిమాన పాత్ర ధుర్యోధనుడే అని కూడా నొక్కి వక్కాణించారు.
ఒక తిక్క శంకరయ్య, ఒక చిరంజీవులు, ఒక రాముడు-బీముడు, ఒక పాతాళ భైరవి, ఒక వెంకటేశ్వర మహత్యం లాంటి సినిమాలు మనకిక రావు. వచ్చినా ఆ నట సార్వ భౌముడి కాలి గోటిని కూడా తాకే విధంగా నటించ లేరు.
అన్న గారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ.
విహారి.
http://vihaari.blogspot.com
అన్నగారు అన్నగారే! ఆయన విలక్షణ శైలి ఇంకొకరికి రాదు.
అదే ఆయనను అందలం ఎక్కించింది, అదే ఆయనను కిందికీ తోసేసింది.
అయితే మొదటి పదవీకాలంలో ఆయన తెలుసుకున్న గుణపాఠాలు మలిదశలో ఆచరణలో పెట్టేలోపే ఆలస్యమయిపోయింది.
ఎన్ని చెప్పినా తెలుగు జాతికి ఆయన చేసిన సేవ అనల్పమయింది.
--ప్రసాద్
http://blog.charasala.com
స్పందించిన అందరికీ నా ధన్యవాదాలు. రానారె...నేను అదీ వ్రాద్దామనుకొన్నాను సమయం కుదర్లేదు.ఇప్పుడు ఆ పని మీదే ఉన్నాను. అదీ అన్నగారి మాటల్లోనే విందాం. చేంతాడంత ఉన్న ఆ ఉపన్యాసాన్ని యూనీకోడీకరించడంలో ఉన్నాను ప్రస్తుతం. ఆయనకు ఇలా నా నివాళి మరోసారి! వేచి చూడండి ఆ మాటలకై!
Post a Comment