నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, నల్లజాతి మహాత్మాగాంధీ "రెవరెండ్. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్" పుట్టినరోజు జనవరి 15. ఈ రోజు అమెరికన్లు ఆయనను స్మరించుకొనే దినం. క్రైస్తవ్యం లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన, జర్మనికి చెందిన 'మార్టిన్ లూథర్'(శ్రీకృష్ణదేవరాయలి సమకాలికుడు!) పేరు పెట్టుకొన్న ఈ మతభోధకుడు అమెరికాలో నల్లజాతి వారికి నిజమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను తెచ్చిపెట్టిన యోధుడు. మన గాంధీ తాతను ఆదర్శంగా తీసుకొని అహింసా పద్ధతుల్లో పోరాటం సలిపిన ధీరుడు. ఈ ఏకలవ్య శిష్యునికి 1964లో నోబెల్ శాంతి బహుమతి రావడం ఒకరకంగా మహాత్మునికి, మహాత్ముని సిద్ధాంతాలకు వచ్చినట్టే అని నేను భావిస్తున్నాను. ఆయన వాషింగ్టన్ డి.సి.లో అబ్రహాం లింకన్ విగ్రహ ఛత్రఛాయల్లో నిలబడి ఇచ్చిన చారిత్రాత్మక ప్రసంగం "ఐ హేవ్ ఎ డ్రీమ్" దే అమెరికాలోని 'టాప్ 100 స్పీచెస్' లో ప్రథమ స్థానం. ఆ ప్రసంగం ఇక్కడ వినండి.
ఈ సందర్భంగా మన 'దేశి అమెరికన్ల'కు ఒక మనవి. నల్లవారి గురించి మాట్లాడేటప్పుడు ఎంత విద్యావంతులైనా "నీ*" అనే మాటను విరివిగా ఉపయోగిస్తుంటారు, దయచేసి ఆ పద్ధతి మానండి. ఒకవైపు తెల్లవారు వర్ణవివక్ష చూపుతున్నారంటూ అక్షేపిస్తూనే అదే సమయంలో అంతకన్నా ఎక్కువ వివక్ష నల్లవారి పట్ల చూపుతారు. తొమ్మిదో తరగతిలో మా నాన్న తెచ్చి ఇచ్చిన "ఏడుతరాలు", అలెక్స్ హెయిలీ ''రూట్స్' కు తెలుగు అనువాదం చదివి అమెరికాలో వారు పడ్డ బాధలను ప్రత్యక్షంగా అనుభవించిన అనుభూతి కలిగింది. అందరూ తప్పక చదవాల్సిన పుస్తకమిది.
కానీ ఇప్పుడు అదే అమెరికాలో 2008లో జరిగే అధ్యక్షపదవి ఎన్నికలలో నిలబడే సూచనలు, నిలబడితే నల్లజాతి నుంచి అమెరికా తొలి అధ్యక్షుడైయ్యే అవకాశం "బరాక్ హుశేన్ ఒబామా" కు కలగడం వెనుక చైతన్యం ఈ 'కింగ్' యే అనడంలో సందేహం లేదు. ఈ సందర్బంగా మరో వైచిత్రి గమనించారా- సద్దాంలోని 'హుశేను', అంతర్జాతీయ తీవ్రవాది ఒసామాను పోలిన 'ఒబామా' తన నామధేయంలో కలిగిన ఈ 'బరాక్ ఒబామా' ప్రస్తుతం ఇల్లినాయి రాష్ట్రం నుంచి పేరిన్నికగన్న అమెరికన్ సెనేటర్. తండ్రిది కెన్యా, తల్లిది కాన్సాస్. తండ్రి ముస్లిం, తల్లి క్రిస్టియన్ అయినా ఇద్దరూ మతం పాటించని నాస్తికులు. ఈయన ఆస్తికుడైన ప్రొటెస్టెంట్ క్రిస్టియన్. ఈయన అమెరికా అధ్యక్షుడైతే మాత్రం ఈ విషయం ఇక్కడే మొదటిసారి విన్నారని గుర్తు పెట్టుకోండి! :-)
(చిత్ర సౌజన్యం: క్రియేటివ్ కామన్స్)
No comments:
Post a Comment