బంగారానికి తావి(సువాసన) అబ్బినట్టు, తరుణి అందానికి తాంబూలం! ఇదిప్పటి మాటకాదండోయ్, ఒకప్పటి మాట. మీరు నమ్మకుంటే మన 'అల్లసాని' వారినడగండి.మన తొలి తెలుగు ప్రబంధమైన 'మనుచరిత్ర'లో ప్రవరుడు దారితెన్నూ తెలియక అడవిలో తిరుగుతూన్నప్పుడు...
"మృగమద సౌరభ విభవ
ద్విగుణిత ఘనసార సాంద్ర పీటీగంధ
స్థగితేతర పరిమళమై
మగువ పొలుపుఁదెలుపు నొక్క మారుతమొలసెన్."
(నా తాత్పర్యం: ఒక పాలు కస్తూరి, రెండు పాళ్ల కర్పూరంతో కూరబడిన తాంబూలం ఇతర వాసనలన్నిటినీ మరుగుపరుస్తూ, తన సౌరభాన్ని విరజిమ్ముతూ అక్కడ ఓ వనిత ఉన్నదని తెలియజేసింది.)
"అతడావాత పరంపరా పరిమళ వ్యాపారలీలన్ జనా
న్విత మిచ్చోటని చేరఁబోయి కనియెన్ విద్యుల్లతా విగ్రహన్
శతపత్రేక్షణఁజంకరీకచికురన్ జంద్రాస్యఁ జక్రస్తనిన్
నతనాభిన్ నవలా నొకనొక మరున్నారీ శిరోరత్నమున్."
(నా తాత్పర్యం: అతడు చల్లటి పిల్లతెమ్మెరల మీదుగా అలలు అలలుగా వస్తూన్న ఆ పరిమళాన్ని (తాంబూల) అఘ్రాణించి ఇక్కడెవ్వరో మనుష్యులున్నారని అనుకున్నంతలో :'మెఱుపుతీగ లాంటి మేని, విరబూస్తున్న కుసుమాల్లాంటి కళ్లు, తుమ్మెదల్లాంటి పొడవైన నల్లటి కురులు, అందంతో వెలిగిపోతున్న మోము, గర్వంతో వంపుదిరిగిన వ***, లోతైన బొ* కలిగి మరోలోకం నుంచి దిగివచ్చిందా అనుకొనే ఆ వనితను చూశాడు.)
పెద్దన గారి శృంగార కవితా ఝురి గురించి మరోసారి చెప్పుకుందాం కానీ, పై పద్యాల్లో స్త్రీ శృంగార సాధనాల్లో తాంబూలానికి అగ్రస్థానం ఉందని తెలుస్తుంది.
ఇక మన లోకంలో కొస్తే...తాంబూలం 'రానారె' అన్నట్టు నోటి దుర్వాసన పోగొట్టే 'మౌత్ ఫ్రెషనరే' కాకుండా 'క్రిమినాశిని' మరియు ఆహార జీర్ణక్రియలో తోడ్పడే సాధనం. మామూలు తాంబూలాన్ని ఏదైనా పెళ్లి విందుకెళ్లినప్పుడు సుష్టుగా భోంచేసాక కస్తూరి, జవ్వాజి, చందనాది చక్కెర పలుకులతో లేత తమలపాకుల మధ్య, నున్నటి వక్కలతో, ఎర్రటి సున్నంతో కలిపి నమిలితే ఆ హాయే వేరు.
కానీ పొగాకుతో కూడిన తాంబూలం మన ఆరోగ్య వినాశనానికి హేతువు అవుతుంది. నాకిప్పటికీ గుర్తే మా పెద్దవ్వ ఎప్పుడూ దీన్ని నములుతూ ఉండేది. పొగాకులో ఉండే 'నికోటిన్' చాలా ప్రమాదకారి, ఈ వ్యసనాన్ని ఒక పట్టాన వదులుకోలేము. పళ్లూడిపోయినా 'ఇనుముతో చేసిన గ్లాసు' లాంటి (పేరు గుర్తుకు రావడం లేదు, వక్కాకు పొత్రమా?) దానిలో ఆకు, వక్క, సున్నం, పొగాకు వేసి నున్నగా దంచి మరీ వేసుకొనేది.
ఇదే కాకుండా ఇప్పటి గుట్కా, ఖైనీలు ఇంకా ప్రమాదకరమైనవి. వీటి వల్ల నోటిలో క్యాన్సర్లే కాకుండా కడుపులో, మూత్రాశయంలో ఇంకా ఎన్నో చోట్ల కణితులు వచ్చే అవకాశముంది. గుండె జబ్బులు, రక్త ప్రసరణ లో అడ్డంకులు, వీటన్నిటికీ పొగాకు ఓ కారణం. అందుకు పొగాకు నుంచి ఎప్పుడూ దూరంగా ఉండాలి.
( ఈ చిన్న వ్యాసం తెలుగు బ్లాగుల సమూహంలో రానారె, చరసాల గార్ల ప్రశ్నలకు నా ప్రతిస్పందన. చిత్ర సౌజన్యం: ప్రేమశ్రీ, క్రియేటివ్ కామన్స్.)
5 comments:
photo maatram adirimdi.color full ga chudagaanea tinaalanipinceala vundi
చక్కగా సెలవిచ్చారు. అయితే అంతా ఈ పొగాకుతో అన్నమాట సమస్య అంతా!
ఆకు వక్కా ముసలివాళ్ళు దంచుకొనేదాన్ని మేంఉ "వక్కరోలు" అంటాం.
--ప్రసాద్
http://blog.charasala.com
ఔను వక్కరోలు అంటాం. మంచి పద్యాలను పరిచయం చేశారు డాక్టరుగారూ. "వ***" అంటూ కప్పేశారేమిటండీ, వైద్యులు మీరు ఇలాంటి అరమరలు తగ్గించే యత్నం చేయాలిగానీ!? పద్యాల అర్థం చెప్పే ప్రయత్నం బాగుంది. మనలాంటి వాళ్లకి పద్యాలకు ప్రతిపదార్ధాన్ని వివరించగలిగే పండితబ్లాగరుడు వుంటే బాగుండును. "జంద్రాస్యఁ జక్రస్తనిన్"లో "చంద్ర+అస్య+చక్ర+స్తనిన్" ఈ పదబంధానికి, ఇలాంటి మరికొన్నిటికీ ఇదమిద్దంగా అర్థం చెప్పగలిగేవారెవరూ మనకందుబాటులో లేరా?
"పెద్దన గారి శృంగార కవితా ఝురి గురించి మరోసారి చెప్పుకుందాం" - అన్నారు మీరు. నేనీమాట గుర్తుపెట్టుకొంటున్నాను.
Post a Comment