తెలుగు ప్రజా హృదయాధినేత!
తెలుగు ప్రజలకు చరిత్ర సృష్టించే మరో అవకాశం వచ్చింది. మరో ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజానీకం తమ హృదయాంతరంగాన్ని అవలోకనాల్లో బహిర్గతం చేస్తోంది. పైనుంచి అంతా చిద్విలాసంగా గమనిస్తున్న తెలుగు ప్రజల ఆత్మబంధువు, మేరునగధీరుడు అయిన 'అన్న' గారు "చిరంజీవీ...తెలుగుదేశం* పిలుస్తోంది రా! కదలిరా!" అంటూ గీతోపదేశం చేస్తున్నారు. సమరానికి కాలు దువ్వడానికి సంకోచిస్తూన్న ఈ అర్జునుడి ప్రశ్నకు ...పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
"ధర్మమేదో తెలియని వాడినై నిన్ను అడుగు తున్నాను.
ఏది నిశ్చితంగా శ్రేయస్కరమో అది తెలియ చెయ్యి."
ఆ కృష్ణుడి సమాధానం ఇది:
అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి
"ధార్మికమైన ఈ యుద్ధాన్ని చేయకపోయ్యావో,
దానివల్ల స్వధర్మాన్ని, కీర్తిని వదిలినవాడవైతావు."
సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి
"సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను
సమానంగా భావించి యుద్ధానికి సన్నద్ధుడివికా."
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోऽస్త్వకర్మణి
"కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది. కర్మ ఫలాలపైన ఎప్పుడూ లేదు.
కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చెయ్యడము మానవద్దు."
ఇది నా కల. ఎన్నాళ్లగానో వేచిన సమయం ఆసన్నమయ్యింది. అడుగు ముందుకు వేసేందుకు తటపటాయిస్తున్న వీరార్జునుడికి కర్తవ్యం బోధించడానికి అన్నగారు కలలోనైనా కనబడి ఇలా అంటారనే ఓ చిరు ఆశ.
'శోధన' సుధాకరుడన్నట్లు మన తెలుగు ప్రజలు వెర్రివెంగళప్పలేం కాదు. వందేళ్ల కాంగ్రెసును ముఖానికి రంగు పూసుకొనే ఓ నటుడు ఏం చేస్తాడులే అన్న ఆనాటి రాజకీయ దిగ్గజాల అంచనాలను తలక్రిందులు చేస్తూ తొమ్మిది నెలల పసివాడని పార్టీని అందలమెక్కించిన ఘనత వీరి సొంతం. అలా నెత్తిన పెట్టుకొన్న అదే పార్టీని, నిర్లక్ష్యం వహించిన దానికి ఐదేళ్ల తర్వాత నిర్దాక్షిణ్యంగా కూలగొట్టి తమ రాణువను తెలియజేసిందీ వీరే. అలాగే సమకాలీన రాజకీయాల్లో తమ ప్రతాపం ఎలాంటిదో మళ్లీ చూపించారు. అయితే నుయ్యి, కాకపోతే గొయ్యిలా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తమకు ఆసరా ఇచ్చే చెయ్యి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ శివశంకరుని 'వర ప్రసాదాని'కై కాచుకు కూర్చొన్నారు.
కేవలం నటుడైనంత మాత్రాన ఆయన రాజకీయాల్లో రాకూడదనడం, నీ వంటి మంచి మనిషి ఈ రాజకీయ రొంపిలో దిగబడి బురద పూసుకోవడమెందుకు అని చాలా రోజులుగా అందరూ అంటూన్న మాట. అంటే మంచి వ్యక్తులు రాజకీయాలకు తగరా? సున్నిత మనస్కులు మంచి నాయకులు కాలేరా? నా వరకు దయ, సహానుభూతి ఉన్న వ్యక్తి వల్ల చాలా మందికి మంచి జరుగుతుంది. అలాగే నటుల్లో నుంచి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాయకులు పుట్టారు. ప్రపంచ చరిత్రను మలుపుతిప్పిన 'రొనాల్డ్ రీగన్' దగ్గరి నుంచి నేడు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కెల్లా మంచి పరిపాలనాదక్షుడిగా పేరు గడించిన 'ఆర్నాల్డ్ షార్జ్వ్నెగ్గర్' వరకూ, తమిళనాట నీరాజనాలందుకొన్న ఎం.జి.ఆర్. దగ్గరి నుంచీ మన అన్న ఎన్.టి.ఆర్. వరకూ చరిత్రకు భాష్యం చెప్పినవారే.
ఇక ముఖ్యమంత్రి అయ్యే విషయాని కొస్తే, వచ్చే మొదటి ప్రశ్న చదువరి గారన్నట్టు "ఆంధ్ర దేశానికా? ఆంధ్ర ప్రదేశానికా?" అన్నది. తెలంగాణా మీద స్పష్టత లేకుండా ఎన్నికల బరిలో దిగే అవకాశం నాకు కనిపించడం లేదు. అందుకే గత టపాలో రెండు కుర్చీలు వేసింది అన్యాపదేశంగా ఈ విషయం దృష్టిలో ఉంచుకొనే! నా సొంత అభిప్రాయం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు ఉండడంలో తప్పేమీ లేదు. ప్రపంచం నలుచెరగులా వ్యాపించిన తెలుగు వారు వివిధ దేశాల్లో నివసిస్తూ మాతృభూమితో సంబంధాలు నెరుపుకోగా లేనిది, ఒకే దేశంలో పక్కపక్కన 'తెలంగాణా', 'ఆంధ్రసీమ*'లనే రెండు రాష్ట్రాలుగా కలసి ఎందుకు ఉండలేరన్నది నా ప్రశ్న.
ఇక పొత్తులంటారా నా అభిప్రాయం ప్రకారం అవినీతి రహిత, ప్రజాభ్యుదయ ప్రభుత్వాన్ని అందించడానికి 'డా.జయప్రకాశ్ నారాయణ్'తో కలవాలని, అప్పుడే ఈ పోరాటానికి ఓ గతి, లక్ష్యం ఉంటాయి. అభినవ తిమ్మరుసు లాంటి ఆయన పరిపాలనా అనుభవం తోడైతే ఈ అభినవ కృష్ణరాయల కత్తికి ఎదురుండదు. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందనా!
Disclaimer:
మెగాస్టార్ చిరంజీవి: "నేనంటే వల్లమాలిన ఇష్టం కల ఓ అభిమాని, తమ్ముడూ!"
*దేశమంటే పార్టీ కాదోయ్...దేశమంటే మనుషులోయ్!"
*ఆంధ్రసీమ - స్వకపోలకల్పితం.
{భగవద్గీత: సాంఖ్య యోగం లోని శ్లోకాలు, మొదటి చిత్రం-తెవికీ నుంచి.
రెండవ చిత్రం: ఎయిడ్స్ డే, డిసెంబరు 1, 2003 న రవీంద్రభారతిలో }
Labels: ఆంధ్రప్రదేశ్, చిరంజీవి, రాజకీయాలు








20 Comments:
నిజంగా మంచి పనులు చేయటానికి రాజకీయాలోకి రావాలా?
మధర్ తెరీసానే ఆదర్శంగా తీసుకుని తనదైన శైలిలో ప్రజలకు సేవ చేస్తున్నారే...
అది సరిపోదంటారా స్మైల్ గారు.
నేనూ చిరంజీవి అభిమానినే కాని ఓ నటుడిగా మాత్రమే...
నేనూ అదే ప్రశ్న అడుగుతున్నాను. అసలు నాకింతవరకూ చిరంజీవి ఆశయాలే అర్ధం కాలేదు. సినిమాల్లో డైలాగులకు, బయటకు చాలా తేడా వుందండి. నాకే అర్ధం కాకపోతే ఇక ఒక బడుగుజీవికి ఏమర్ధం అవుతుంది? మీలాంటి వీర గాలి మరలకు ఇది ఆనందమేమో గానీ, మాకు మాత్రం ఇకనైనా అసలు నాయకత్వం తెలిసిన యువకులు నాయకులుగా రావాలి. నా దృష్టిలో చిరంజీవికి నాయకుడిగా చాలా తక్కువ మార్కులు పడతాయి. మీరెన్ని పద్యాలు రాసేసినా అది నిజం.
ఒకటి మర్చా..
ఇప్పుడు చిరంజీవి కోసం హటాత్తుగా మీరు మన తెలుగు ప్రజలేమీ "వెర్రి వెంగళప్పలు" కాదనటం పెద్ద జోకండి :-) మనం అంత తెలివయినవాళ్ళమయితే ఇంత దరిద్రంగా రాష్ట్రం ఎందుకేడుస్తుంది? చిరు ప్రేమ పక్కన పెట్టి రాష్ట్ర శ్రేయోభిలాషిగా ఆలోచించండి?
మీరు పైన రాసిన పద్యం JP మీద ఎందుకు రాయలేక పోయారు? అతను హీరో కాడనేగా?
అశ్విన్...రావాలనే నా ఆకాంక్ష.
సుధాకర్...నేను జె.పి.కి ఓ మోస్తరు పంకానే. నిజం చెప్పాలంటే "జె.పి." రాష్ట్ర రాజకీయ ఆరోగ్యానికి అవసరమయ్యే చేదు మందు, కానీ అది గొంతులో దిగాలంటే కాస్త తీపి చేర్చాలి. ఆ తీపి గురించే నేను మాట్లాడుతున్నది.ఛరిస్మా లేని ఎంత ఉదాత్త ఆశయాలున్న నాయకుడైనా మన ప్రజాస్వామ్యంలో మనలేడు. అందుకే ఆ రెండు శక్తుల పునరేకీకరణ గురించి మాట్లాడింది. ఇక చిరు ప్రేమ అంటారా? అందుకేగా 'Disclaimer' పెట్టింది :-)
ఇంత పెద్ద చదువులు చదువుకొని, సాహిత్యం ఇంత బాగానేర్చిన వారై, వ్యక్తిత్వవాదానికి మకుటమైన అమెరికాలో వుంటూ, మీరే ఇలా వీర పూజ (హీరో వర్షిప్పు)కు పాలుబడుతుంటే నాకు బాధగానే వుంది.
మంచి మనుషులు రాజకీయాలోకి రావాలి అది ఎంతో ఆశించదగ్గది, అందులో సందేహం లేదు. కానీ చిరింజీవినికూడా తన అర్హతల ఆధారంగానే లెక్కకట్టాలి గానీ, అకారణంగా పవిత్రమైన ఓటు 'దానం' చేయడం తప్పే అవుతుంది. అర్హతలంటే, గ్యాంగ్ లీడరులో స్టెప్పులు కానేకాదు. బ్లడ్ బ్యాంకులంటారా, అంత కంటే పెద్ద అర్హత సిన్సియారిటీ.
అది రామారావుకి వుండేది (అదృష్టవసాత్తు). దావీసూకర్ణ సినిమా చూసినపుడు అతనూ మనిషే అన్న విషయం నేనూ కొంత సేపు మఱచిపోతాను. కాబట్టి మీ వీరాభిమానం నాకు అర్థమవుతుంది.
నటుడుని 'కథా'నాయకుడిగా కాకండా వ్యక్తిగా చూసిననాడే దేశం పురోగమిస్తుంది.
అఱ్ఱఱ్ఱే.. మఱిచానే మనం భారతావనిలో భాగమైన ఆంధ్రదేశం గురించిగా మాట్లాడుతున్నాం, ఇక్కడి జనులకు అంత బుద్ధి ఎక్కడిది.
చిరంజీవి రాక తెలుగునాటి బాగుకోసమేనని ఆశిస్తూ... చిరాహ్వానం పలుకుతున్నా...
బాగా చెప్పారు..చాలా విషయాలపై నిర్ధిష్ట అభిప్రాయాలున్న జేపీకి, అభిమాన బలగమున్న చిరంజీవి కాంబినేషన్ ప్రస్తుత పరిస్థితుల్లో బాగుంటుంది. (అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు కావాలన్న గొడవొస్తుందేమో?)..దేజావూ మళ్ళీ ఎన్టీయార్..నాదెండ్ల?? (తమాషా)
హీనులం...
బలహీనులం...
ఆత్మవిశ్వాసం అధోపాతాళానికి చేరుకున్నవాళ్ళం...
బానిసలం...
బంధితులం...
మనకు రెండు రాష్ట్రాలు
జాతి సర్వనాశనానికి ద్వారాలు.
మనకున్నదొకటే భూమి. అది ఈ ఆంధ్రప్రదేశ్.
వలస రాజ్యాలు లేవు.
ఆక్రమించుకున్న భూములు లేవు.
నెహ్రూ, రాజాజీ కలిసి మన తలాతోకా కత్తిరించగా
అయిదాఱు జిల్లాల్ని శాశ్వతంగా కోల్పోగా
ఎన్నిసార్లు లెక్కపెట్టుకున్నా
మిగిలినవి ఈ ఇరవైమూడు జిల్లాలే.
ఆవేశపడకండి బాబూ...ఆలోచింఛండి.
బాగా ఆలోచించండి.
కాసేపు మనం ఇండియాలో భాగం కాదనుకుని ఆలోచించండి.
మనకు మనమే మిగిలితే మన పరిస్థితి ఏమిటని ఆలోచించండి.
విషయం బోధపడుతుంది.
రాకేశ్వరా...కొన్ని జీవితాలింతే! అదేంటో ఎన్టీయార్ అన్నా, మెగాస్టారన్నా కనిపిస్తే నోట్లో ఈల అదంటదే వచ్చేస్తుంది :-)
తెలుగు వీర...కుర్చీ పవరాలాంటిది మరి!
తాడేపల్లి గారూ...మీ బాధ అర్థం చేసుకోగలను.అన్నింటి కంటే బళ్లారి,చెన్నపట్నం చేజారడం ఇంకా బాధాకరం. రాష్ట్ర విభజన నాకూ ఇష్టం లేదు. కానీ విడిపోతామని వారు మంకు పట్టు పట్టుతున్నప్పుడు,అందులోనూ తెలంగాణా జిల్లాల్లో ప్రజాభిప్రాయంలో సింహభాగం అదే అయినప్పుడు మనం ఏం చేయగలమన్నదే...నా అభిప్రాయానికి హేతువయ్యింది.
తా.'బాసు'గారు...మరో మాట. ఈ ఆంధ్ర"ప్రదేశ్" అనే పేరు పెట్టిన మహానుభావుడెవరో మీకేమైనా తెలుసా? అసలు భాషాప్రయుక్త రాష్ట్రం కోసం ఇంత పెద్ద పోరాటం జరిగి, దేశంలో మనదే తొలి భాషాప్రయుక్త రాష్ట్రమైనప్పుడు అజంత భాషగా పేరుగాంచిన మన తెలుగునేలకు ఈ "ప్రదేశ్" అనే తోక ఎలా వచ్చిందో నాకెప్పటికీ అర్థం కాని విషయం.
తెలంగాణా ఎలాగూ రాదులెండి. దాని గుఱించి నాకు చింత లేదు. నా బాధల్లా - ఇతర రాష్ట్రాలవాళ్ళందరూ కలిసికట్టుగా దూసుకుపోతూంటే మన తెలుగువాళ్ళ రాజకీయ చైతన్యమూ తెలివితేటలూ ఇలా నిరంతరాయంగా నిష్‌ప్రయోజన విషయాల మీద దుర్వినియోగం చెయ్యబడుతున్నాయేమిటా ? అని. ప్రత్యేక రాష్ట్ర నినాదాలకి అభివృద్ధి లేకపోవడం కాదు కారణం. అభివృద్ధి మఱీ ఎక్కువైపోవడమే కారణం. "వాడు/అది జిందాబాద్, వీడు/ఇది మొరదాబాద్" అంటూ రోడ్డెక్కేవాడెవడూ బలహీనుడు కాడు.
మూడు రకాల వ్యక్తులుంటారు. ఒకడు కత్తితో సొఱకాయలు కోస్తాడు. ఇంకొకడు ఇతరుల మెడకాయలు కోస్తాడు. వేఱొకడు దానితో తన మెడని తానే కోసుకుని ఛస్తాడు. మన తెలుగువాళ్ళం మూడో శ్రేణికి చెందినవాళ్ళం.
ఎందులో ప్రజాభీష్టానికి విలువుందో తెలియదు. దూరదృష్టి గల Statesman ప్రజల చేత ఎన్నుకోబడ్డవాడైనప్పటికీ జాతి యొక్క సుదీర్ఘ భవిష్యత్ ప్రయోజనాలకే విలువిచ్చి ప్రజాభీష్టాన్ని పక్కన పెడతాడు. ప్రజలందరూ ఒకరోజున "మాకు విషం కావాలి" అని వీధుల్లోకొస్తారు. అలాగని మనం చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతివాడికీ ఇంత అని కోటా ప్రకారంగా విషం సరఫరా చెయ్యలేం. ప్రజల్లో ప్రతివొక్కడూ తన గుఱించే ఆలోచిస్తాడు. సైకిలు మీద వెళ్ళేవాడికి తానూ తన సైకిలే లోకం. కారులో వెళ్ళేవాడు తన గుఱించే కాక కారులో ఉన్న మిగతావాళ్ళ గురించి కూడా ఆలోచిస్తాడు. బస్సు డ్రైవరు తనతో పాటు 50 మంది గుఱించి ఆలోచిస్తాడు. ఇలా వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ వాళ్ళ దృష్టి పరిధి (Range) భేదిస్తుంది. నాయకులూ మేధావులూ కేవలం తమ గుఱించి ఆలోచించకూడదు. అలా జరక్కపోవడమే ఈ ప్రాంతీయవాద సంక్షోభానికి కారణం.
కాని ప్రజాభీష్టం అనేక ప్రచార సాధనాల ద్వారా రూపుదిద్దబడుతున్నప్పుడు ప్రజలు పొఱపడే అవకాశం లేకపోలేదు. ఆ పొఱబాట్లనీ అపోహల్నీ సరిదిద్దే బాధ్యత ఉన్నవారు ఆ ప్రచారసాధనాల్నే వినియోగించుకుని ఆ పని చెయ్యకుండా ద్రౌపదీవస్త్రాపహరణంలో భీష్ముడిలా నోరుమూసుకుని కూర్చోవడమే ప్రజలు ప్రజలు "ప్రత్యేకరాష్ట్రా"లంటూ తప్పుదోవ పట్టడానికి కారణం. ఒకడు తప్పు మాట్లాడుతున్నప్పుడు "నువ్వు మాట్లాడుతున్నది తప్పు" అని చెప్పకపోవడం ఆ తప్పుని సమర్థించడం కిందికొస్తుంది కదా !
మళ్ళీ అదే ప్రజలు తిరిగి కలిసిపోతామంటే మాత్రం అది చాలా కష్టమౌతుంది. కలవకుండా చూడ్డానికి అప్పుడు అనేకమైన బయటి vested interests కాచుకుని కూర్చుంటాయి. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా పరిస్థితి చూడండి. అడుసు త్రొక్కనేల ? కాలు కడుగనేల ?
అభివృద్ధి కోసమో మఱొకదాని కోసమో ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు. అందరమూ కలిసుందామనుకున్నాం. కలిసున్నాం. ప్రతి రాష్ట్రంలోను దేశంలోను వెనకపడ్డ ప్రాంతాలూ, ముందుపడ్డ ప్రాంతాలూ ఉన్నాయి. ఇంగ్లండుకే తప్పలేదు. దానికీ సమైక్యానికీ ముడిపెట్టడం భావ్యం కాదు.
This post has been removed by the author.
ప్రతి మహానుభావుడి వెనుకా ఒక పాపపు గతం,ప్రతి పాపాత్ముడికి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని పెద్దలు చెప్పారు.ప్రతిరాజకీయ పార్టీ ఆవిర్భావం వెనుకా చాలా వ్యూహాలు,పైకి చెప్పలేని బోలెడు కారణాలు ఉంటాయి.కాలక్రమంలో వెలుగు చూస్తాయి.ప్రపంచం అలీన,అమెరికా, రష్యా అనుకూల శిబిరాలుగ విడిపోయిఉన్న కాలంలో అమెరికా సి ఐ ఏ ,రష్యా కెజిబి ప్రపంచవ్యాప్తంగా
చాలా గూఢచారి సినిమాలు నడిపాయి.గోర్బచేవ్ గ్లాస్ నాస్త్,పెరిస్త్రోయికా తర్వాత కెజిబి రహస్యపత్రాలను మాస్కో వీధుల్లో కేజీల లెక్కన అమ్మారు.సి ఐ ఏ గురించి అందులో పదవీ విరమణ చేసిన ప్రతి ఉద్యోగి ఒక పుస్తకం రాసి పడేస్తున్నారు.అతి రహస్యం బట్టబయలు,కాకపోతే కొంచెం సమయంపడుతుంది.లోక్ సత్తాను రాజకీయ పార్టీగా మార్చే హక్కు జేపికి ఎలా ఉందో,చిరంజీవి బ్లడ్ బాంకును రాజకీయ పార్టీగా మార్చుకునే హక్కు చిరంజీవికి ఉంది.అలాగే కాసాని జ్ఞానేశ్వర్, విజయశాంతి,శ్రిరామగిరి రామచంద్ర రావ్ ఇలా అందరికీ ఉంటుంది. వారికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను మనం ఎందుకు కాదనాలి.డాక్టర్ కోర్సు చదివి, ఐ యే ఎస్ ఆఫీసరయ్యి,స్వచ్చంద సంస్థ స్తాపించి రాజకీయాల్లోకి జేపి వచ్చినప్పుడు,డిగ్రీ చదివి,సినిమాతార అయ్యి, రక్తదానాలు వగైరా స్వచ్చంద సేవలు చేసి,రాజకీయాల్లోకి చిరంజీవో ఇంకొకరో ఎందుకు రాకూడదు? ఎన్ టీ యార్ కి ఓట్లేసిన వారందరూ అతని సినిమా అభిమానులు కాదేమో.చిరంజీవి రాజకీయాల్లోకి వస్తాడో రాడో అనే విషయం పక్కన పెడితే,అతని గురించి లోక్ సత్తా కార్యకర్తలు ఎందుకు ఇన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారో?
ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతీ ఒకరికీ ప్రజాప్రతినిధి అయ్యే హక్కు ఉంది. చాలా మంది ప్రకారం మంచి వారు, సున్నిత మనస్కులు రాజకీయాల్లో రాణించే అవకాశం లేదు. నా ఉద్ధేశంలో మనం అక్కడే తప్పు చేస్తున్నాం.చిరంజీవి ఒక నటుడు కావడం మూలాన చాలా మందికి ఆమోదయోగ్యుడు కాలేకపోతున్నాడు(కొంత మంది బ్లాగరుల అభిప్రాయాలు). నేను కూడా జే. పి. ని కొంతవరకూ అభిమానిస్తాను. కానీ అతనికి జనాకర్షణ లేదు. చిరంజీవి, అతని పొత్తు ని ఆహ్వానిస్తాను. తద్వారా మనం కోరుకుటున్న పాలన కి కొంతలో కొంత బీజం ఐనా పడుతుందని ఆశ.
అందరికీ రాజకీయాలు అంటే చాలా చిన్న చూపు. దాన్ని ఒక గొప్ప వ్యవస్థ గా మనం మార్చలేమా? దానికి మనమే ఎందుకు పూనుకో కూడదు?
అశ్విన్ గారి అభిప్రాయం ప్రకారం రాజకీయాల్లోకి రాకుండా కూడా సేవ చేయొచ్చు. కానీ మనమే రాజకీయ ప్రక్షాళన కి ఎందుకు ప్రయత్నించ కూడదు? మార్పు ఎక్కడొ రావడం కాదు మనతో ప్రారంభం కావాలి.
వ్యక్తి కి మంచి మనసు సేవ చేయాలనే స్వభావం/కోరిక ఉంటే చాలు. 99% ఎవరైనా ఒక రంగంలో ఉన్నత స్థానం చేరుకున్నారంటే వారికి ఉత్సాహం, అవసరం ఉంటే వేరొక విషయ అభ్యసన అనేది అంత కష్టం అనుకోను(స్వాభిప్రాయం).
ఏమైనా తప్పులు ఉంటే క్షమించ గలరు. సాధారణంగా బ్లాగులను చదవడం మాత్రమే చేస్తుంటాను. నా భావాలను ఇంకా సరిగ్గా వ్యక్తీకరించ లేకపోయానేమో. :-P
మీరు చిరు రాజకీయాలలోనికి రావాలనుకునేది MLA గానా ? CM గానా? CM కావాలంటే MLAల మెజారిటీ వుండాలి కదా? ఇప్పుడు చిరంజీవి వెనుక ఎవరు వున్నారు? అదీ మంచి ఆశయాలతో?
రేప్పొద్దున్న హోమ్ మంత్రిగా అరవింద్ గార్ని, లేకపోతే ఇంకొక కోన్ కిస్కా గాడిని అసలు వూహించలేకపోతున్నాం. ఒక మనిషి CM అయితే అంతా మారిపోవటానికి ఇది ఒకే ఒక్కడు సినిమా కాదు కదా? పోనీ చిరు ఇప్పుడున్న వెధవ పార్టీల మద్దతుతోనే మరలా వస్తే షరా మామూలే.
జేపీ ప్రస్తుతం చేస్తున్నది ఒక ప్రత్యేక పంధా. ఒక శాస్త్రీయమైన ప్రజాస్వామ్య చికిత్స. దానికి చిరు కు వున్న ఛరిష్మా అక్కరలేదు. అన్ని పుచ్చు సినిమాలు (మీరు ఒప్పుకోవాలి ఇది) చెయ్యనక్కరలేదు. అంతా తెగ కాన్ ఫ్లిక్టింగు పంధాగా ప్రస్తుతం చిరంజీవి లాబీ వుంది. పవన్ స్థాపించిన CPF మూసినదిలా పేరుకే పెట్టారు. ఏం చేస్తున్నారో ఒక వెబ్ సైటు లేదు పాడూ లేదు. అసలు దానికి చిరు సపోర్టు అంతకన్నా లేదు. అంతా మన ఖర్మ...బ్యాక్ టూ వ్యక్తి పూజ.
'బాసు' గారు...మీదన్నది బహు బాగున్నది.
'రాజేంద్ర' గారు...మీ ప్రశ్నలే నా ప్రశ్నలూ!
ఇక వ్యాఖ్యల విషయంలో చుక్కెదురైందని అన్నారు.ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు,క్షంతవ్యుణ్ని.మన బ్లాగు టెకీలు చెప్పాలి కారణమేంటో! అన్నట్టు మీ మరో వ్యాఖ్య ఇక్కడే పెట్టడానికి ప్రయత్నిస్థాను.
'సుకుమార్'గారు...భావవ్యక్తీకరణ అదిరింది. మీరూ ఓ బ్లాగు మొదలుపెట్టే సమయం ఆసన్నమయ్యింది.
'సుధాకర్' గారు...మొదట M.L.A.అయితే కదా C.M. అయ్యేది:-) ఒకే ఒక్కడు-ఎన్.టి.ఆర్. మన రాష్ట్ర, తరువాత దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చగా లేనిది, ఇప్పుడెలా సాధ్యం కాదంటారు? రాజేంద్ర గారి వ్యాఖ్యను ఒక్కసారి గమనించండి.
'విశాఖ తీరం'నుంచి "రాజేంద్రకుమార్ దేవరపల్లి" ఇలా అన్నారు...
ఇరాక్ మీద యుద్ధం వద్దంటే సద్దాం హుస్సేన్ అనే సైనిక నియంతను సమర్దించినట్లు కాదు.బుష్ చేస్తున్న పనులు ప్రపంచప్రజా కంటకంగా ఉన్నాయి అంటే మనం వామపక్షాల సభ్యులం,సానుభూతిపరులం కానక్కర్లేదు. చిరంజీవికి రాజకీయాల్లోకి వచ్చే హక్కు ఉంది అంటే మనం రేపు చిరంజీవి తరపున గోడ రాతలకు,వీధి ప్రచారాలకు దిగుతామని కాదు.దేశంలో ఆర్ధిక సరళీకరణ ప్రారంభమయ్యాక ఎన్నో విదేశీ కార్ల కంపెనీలు వచ్చాయి.వ్యాపారాలు విస్తృతంగ పెంచుకున్నాక కూడా ప్రమోద్ మహాజన్ని అడ్డంపెట్టుకొని మరే కొత్తవిదేశీకార్ల కంపెనీ రాకుండా ఎంబార్గో విధించమన్నారు.అలాగే ఉంది మీరు చెప్పేది.దేశాన్ని నాశనం చేస్తున్న రాజకీయనాయకులకు చట్టంలో లోపాలను చెప్పి తప్పుడుపనులు చేయించేది కూడా మేధావులు అనిపించుకునే ఐ ఏ ఎస్లూ వగైరాలే.మీరు చెప్పినట్లు రాజకీయమంటే ఒకేఒక్కడు సినిమా కాదు అలాగే పరుచూరి బ్రదర్స్ రాసే డయిలాగులు కూడా కాదేమో... మీ ఉద్దేశ్యంలో మేధావులు నేరాలు చేయరు,నేరుగా ఆకాశం నుంచి ఊడిపడతారనే భ్రమలు మనదేశంలో ఎవరికీ లేవు.ఇప్పుడున్న ఎం ఎల్ ఏలలో మేధావివర్గానికి చెందినవారు లేరనా మీఉద్దేశం? ఉన్నా ఏమీ చేయట్లెదు ఎందుకంటే పాలనాయంత్రాంగం ఏఒక్కడిమీదో నడవదు కాబట్టి.రేపు జేపి వచ్చినా,చిరంజీవి వచ్చిన ఇదే కధ పునరావృతమవుతుంది. ప్రజాస్వామ్యమనే మహాసముద్రంలో ఎన్నో పార్టీలు వచ్చి కలుస్తుంటాయి.ఇప్పటికే రిజిష్టర్ అయిన పార్టీలు,ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి.వాటికి ఇప్పుడు చిరంజీవి పెడతాడనుకుంటున్న పార్టీ జతకావచ్చు,లేదా సమూల మార్పులు తీసుకు రావచ్చు.ఒకవేళ రేపు ఏపెద్దల సూచనల మేరకో జేపి,చిరంజీవి ఒకటిగా పోటీ చేస్తే????
కాకతాళీయమో...
మా ఇద్దరి 'పౌన:పున్యాల'(ఫ్రీక్వెన్సీ)సామ్యమో ...
నేటి ఆంధ్రజ్యోతిలో డా.ఎ.పి.విఠల్ గారి వ్యాసం "రేపటి రాజకీయం చిరంజీవం"లో
http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2007/dec/13edit3
నేను ప్రస్థావించిన కొన్ని అభిప్రాయాలు ప్రతిఫలించాయి.
మచ్చుకు కొన్ని-
*లోక్‌సత్తా నేత జయప్రకాశ్ సైతం తన 'సదాశయాలు' విస్తృత ప్రజా బాహుళ్యంలోకి జేరాలంటే తాను ఒంటరిపోరు సాగించడం కంటే పేదల ఆకాం క్షలకు కేంద్రంగా మారనున్నదని చెప్తున్న చిరంజీవిపార్టీతో పొత్తు లో ఉండటం లాభదాయకం. అలాగే లోక్‌సత్తా ప్రవచిత ఆశయాలు చిరంజీవికి ఆమోదయోగ్యం కాని పరిస్థితే ఉండదు. కనుక ఇలాంటి వాతావరణం చిరంజీవి పార్టీకి గొప్పశక్తి సామర్థ్యాల నిస్తాయి.
*ఉమ్మడికుటుంబంలో కుటుంబ పెద్దగా ఉన్న పెద్దన్న కూడా సహేతుకమో అహేతుకమో ఒక సోదరుడు 'నా ఆస్తి నాకు పంచి ఇవ్వండని' మఠం వేసుకు కూర్చుంటే చేసే దేముంది? మంచిచెడ్డలు నచ్చచెప్పి అయినా ఆ సోదరుడు తన పట్టు వీడక పోతే ' జాగ్రత్తగా మసులుకో, నీ వాటా నీకు పంచి యిస్తాను. అదెలావున్నా నీ కష్టాలలోనూ, సుఖాలలోనూ నీవు నా సహాయసహకారాలు తీసుకొనేందుకు సంకోచించవలసిన అవసరం లేదు' అని భరోసా ఇచ్చి ఆ తమ్ముడి కోర్కెను నెర వేర్చక తప్పదు. అలాగే ఉమ్మడిరాష్ట్రంలో ఒక ప్రాంతంసైతం అలా విడిపోక తప్పదని, అక్కడి జనబాహుళ్యం అండదండలతో పోరాటానికి సిద్ధమైతే అది హింసాత్మకం కాకుండా అన్నదమ్ముల వలె శాంతియుతంగా జరగవలసివుంది.
*గతంలో ఎన్‌టిఆర్ పార్టీ స్థాపించి 'రా! తెలుగుదేశం పిలుస్తోంది రా!' అంటూ ప్రజలను ఆకర్షించేందుకు రథ ప్రచారానికి పూనుకున్నారు. ఇప్పుడు చిరంజీవికి లక్షల సంఖ్యలో ఉన్న ఆయన అభిమానులే రాష్ట్ర వ్యాప్తం గా 'రా! మేం పిలుస్తున్నాం, రాజకీయాలలోకి రా' అని పిలుస్తున్నారు. లక్షలాది అభిమానులు అందులో వేలాదిగా ఉన్న వీరాభిమానులు ఆయనకున్న శక్తి!. ఇప్పుడు ఇక ఎవరికి ఏ మేరకు లాభం నష్టం అన్న అంశంతో నిమిత్తం లేకుండా చిరంజీవి రాజకీయప్రవేశం అనివార్యం అనిపిస్తున్నది.
నా ఏడుపంతా ఒకటే. చిరంజీవి మహా అయితే ఒక నియోజక వర్గానికి MLA అవుతారు. మరి మిగతా రాష్ట్రం సంగతి ఏమిటి? అతను చూపించిన పొత్తు వెధవలకు ఓటు వెయ్యాలంటారా? ఇప్పటి వరకూ అతనికి వెనుక వున్న వారు ఎవరో అర్ఢం కావటం లేదు. మా నియోజక వర్గానికి అక్కడ వున్న చిరంజీవి గాలి మరల సంఘ అధ్యక్షుడు MLA గా నిలబడతాడా? అతనికి నేను ఒక చిరు అభిమానిగా వోటెయ్యాలా? చెప్పండి.మీరు ఇవన్నీ ఆలోచించారా? మీ నుంచి అసలు ఈ టపా నేను వూహించలేదు. ఎంత వారలయినా సినిమా దాసులే అనుకోవాలేమో :-(
సుధాకరులకి ఇప్పటికి అర్థమయినట్లుంది.
ఫాను పోస్టుని కొద్దిగా ఎక్కువ సీరియస్ గానే తీసుకున్నట్లున్నారు.
రాకేశ్వర
చిరంజీవి కలవాల్సిన అవసరమేముంది...? తనకు పరిచయంలేని దానిలొ కాలు పెట్టడం కన్నా, తనకి మంచిని నిలబెట్టాలని ఉంటే, ఈపాటికే ప్రణాళికతో మార్గ దర్శకాలతో ముందుకొచ్చిన లోక్ సత్తా కి, జయప్రకాష్ నారాయణకి మద్ధతుగా ప్రచారం చేస్తే చాలు... చిరంజీవి ఆ విధంగా మార్పుకి సహకరించాడని చరిత్రలో నిలిచిపోతాడు... వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే మాత్రం లోక్ సత్తా కి లాభం కన్నా, దాని ఆదర్శాలకి నష్టం, అడ్డంకి అవుతాడు చిరంజీవి...
Post a Comment
Links to this post:
Create a Link
<< Home